1 Thessalonians 4
"సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీ కిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు."
కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోష పరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించు చున్నాము.
మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
"మీలో ప్రతివాడును దేవుని యెరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు గాక,"
పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగి ఉండుటయే దేవుని చిత్తము.
ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువ లేదు.
కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
"సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకని నొకడు ప్రేమించుకొనుటకు దేవుని చేతనే నేర్పబడితిరి."
ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు.
"సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు,"
"సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడచుకొనుచు మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంత కార్యములను జరుపు కొనుట యందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించు చున్నాము. మృతుల విషయము"
"సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మా కిష్టము లేదు."
"యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును."
"మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాక వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము."
"ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు."
ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువు నెదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకని నొకడు ఆదరించుకొనుడి.